• iconJava Online Training In Andhra Pradesh and Telangana
  • icon9010519704

Opening Hours :7AM to 9PM

BhagavadGeetha

ఓ అర్జునా! నేను కర్మలను చేయకుండా మానేస్తే ఈ లోకములు అన్నీ నశించిపోతాయి. అల్లకల్లోలము అవుతాయి. ప్రజలకు నష్టం కలుగుతుంది. వీటి కంతా నేను కారకుడను అవుతాను కాబట్టి నేను నిరంతరము కర్మలు చేస్తూనే ఉంటాను. అర్జునా! నేను కూడా ఏ పనీ చేయకుండా సన్యాసిలాగా ఉంటే, ఈ ప్రపంచం కూడా నన్నే అనుసరిస్తుంది. లోకమంతా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి నేను కూడా సామాన్య మానవుని వలె కర్మలు చేస్తున్నాను. అలా చేయకపోతే నన్ను అనుసరించే వాళ్లు కూడా చేయవలసిన కర్మలు చేయకుండా సోమరులు అవుతారు. ఆ కారణంగా ఈ లోకములు నిర్వీర్యం కావడానికి నేనే కారణం అవుతాను. నా వలననే ఈ లోకంలో ఉన్న మానవులు సందిగ్ధంలో పడి కర్మలు మానివేసి పతితులవుతారు. లోకంలో అశాంతి ఏర్పడుతుంది. ప్రజలు అన్యాయాన్ని, అధర్మాన్ని ఆశ్రయిస్తారు. దాని ఫలితంగా ఉత్పాతాలు ఉపద్రవాలు సంభవిస్తాయి. ఈ విధంగా నేను లోకులయొక్క వినాశనానికి కారణం అవుతాను. లోకులను చెడగొట్టినవాడిని అవుతాను. కాబట్టి లోక క్షేమం గోరి నేను కర్మలు చేస్తున్నాను. నేను లోకం క్షేమం చూడాలి కానీ లోకాలను సంక్షోభంలోకి నెట్టకూడదు. ఇదే విధంగా జీవన్ముక్తులు అయిన వారు కూడా లోక కల్యాణం కొరకు సాటి మానవుల క్షేమం కొరకు కర్మలు చేయక తప్పదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడూ కర్మలు చేయడం అతని సహజ ధర్మం. కాబట్టి నీవు కూడా నీ విద్యుక్త కర్మ అయిన యుద్ధం చెయ్యి. అని కృష్ణుడు తననే ఉదాహరణగా చెప్పుకుంటూ అర్జునుడికి శతవిధాలా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో సంకరం అనేమాట వాడారు. అంటే ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో.. అనే స్థితి. (కన్ఫ్యూజన్) అప్పుడు చేయకూడని పనులే సాధారణంగా చేస్తారు. చేయాల్సిన పనులు చేయరు. సాధారణంగా వర్ణసంకరము, జాతి సంకరము అని వింటూ ఉంటాము. వాటి గురించి చిన్న వివరణ. మనిషి పుట్టిన తరువాత, ఆడ కానీ మగ కానీ ఏదో ఒకపని చేయాలి. ఏ పని చేయాలో ఎవరికి వారు ఎన్నుకోవాలి. అది వారి వారి సామర్థ్యము, అర్హత, అభిరుచి అంటే ఆసక్తి వీటి మీద ఆధారపడి ఉంటుంది. దీనినే ఎవరి గుణములను బట్టి వారు కర్మలు చేయడం అంటారు. ఎందుకంటే ఎవరైతే ఆసక్తితో పని చేస్తారో వారు ఆ పని చేయడంలో ఆనందం అనుభవిస్తారు. ఇష్టం లేని పని. ఆసక్తి లేని పని ఏడుస్తూ చేస్తారు. ఇది ప్రాథమిక సూత్రము. ఈ సూత్రము ఆధారంచేసుకొని వర్ణవ్యవస్థ(ఈ నాటి భాషలో చెప్పుకోవాలంటే కులవ్యవస్థ) ఏర్పడింది. ఈ వ్యవస్థలో మంచి చెడు రెండూ ఉన్నాయి. అది నిర్వివాదాంశము. అందరికీ అన్ని పనులు చేసే సామర్థ్యము, ఆ పనులలో ఆసక్తి ఉండటం కుదరదు కాబట్టి పూర్వీకులు మానవులను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కోభాగానికి ఒక్కో వర్ణము అని పేరు పెట్టారు. .

కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩

BhagavadGeetha

అర్జునా! మూడులోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏమీ లేదు. అలాగే నేను కోరుకోదగ్గది, పొంద తగినది, నేను పొందలేనిది ఏదీ లేదు. ఐనప్పటికినీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను. అని కృష్ణుడు అన్నారు. ఇప్పటి దాకా కృష్ణుడు అందరి గురించీ చెప్పాడు. అర్జునుడిలో ఏమీ చలనం లేదు. ఇంక లాభం లేదని, ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అర్జునా! నాకు ఈమూడులోకాలలో చేయతగినపని కానీ, చేయవలసిన పని కానీ లేదు. నాకు కావాల్సింది ఏదీ లేదు. కోరతగినది ఏదీ లేదు. అలాగే నేను కోరుకుంటే పొందలేనిది అంటూ ఏమీ లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. నీకు సారధిగా కూడా పని చేయడానికి ఒప్పుకున్నాను. కారణం నాకు అన్నీ తెలుసు నేను గొప్పవాడిని అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ చిన్న పని చేయడానికీ వెనుకాడలేదు." అని తన గురించి తాను చెప్పుకున్నాడు. ఒకవిధంగా కృష్ణుడు, నేను ఆత్మసాక్షాత్కారం పొందిన వాడిని, స్థితప్రజ్ఞుడిని అని . నర్మగర్భంగా చెబుతున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారము. నిర్గుణుడు, నిరాకారుడు, నిర్మలమైన మనస్సు కలవాడు. త్రిగుణములకు అతీతుడు. ఆ ఉద్దేశంలో అనుకుంటే కృష్ణుడికి చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదు. తీరవలసిన కోరికలు అంటూ ఏమీ లేవు. ఆయన కోరుకుంటే తీరని కోరిక అంటూ ఏదీ లేదు. రెండవ ఉద్దేశం కృష్ణుడు జ్ఞాని. అన్నీ తెలిసిన వాడు. అన్నిటికీ అతీతుడు, మాయ గురించి తెలిసిన వాడు. స్థితప్రజ్ఞుడు. అలా చూచినా కూడా కృష్ణుడికి చేయవలసిన కర్మ, తీర వలసిన కోరిక అంటూ కూడా ఏమీ లేదు. అందుకే అంటున్నాడు.... అయినా నేను లోకం కొరకు కర్మలు చేస్తూనే ఉన్నాను. ఎందుకు? ప్రజలు నన్ను చూచి, వారూ అలాగే ఆచరించాలి. ధర్మమార్గంలో నడవాలి. అంతే కానీ నా కోసం కాదు. నాకు రూపం లేదు. అయినా ఒక రూపం ధరించాను. ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను. చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక సామాన్యుడు ఏమేమి చేయాలో అన్నీ చేసాను. వీలున్నంతవరకు ప్రజలకు ధర్మమార్గంలో నడవమని బోధించాను. ఇంతెందుకు ఇప్పుడు నీకు సారథిగా ఉన్నాను. ఎంతో ఉత్సాహంగా నీకు సారధ్యం చేస్తున్నాను. నీ ఆజ్ఞలు పాలిస్తున్నాను. నీవు రథం ఎటు పోనిమ్మంటే అటు పోనిస్తున్నాను. ఒక విధంగా నీకు సేవచేస్తున్నాను. ఈ విధంగా నీకు సారధ్యం చేసి నందు వలన నాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. పైగా నష్టం ఎక్కువ. ఎందుకంటే, నీ మీదికి సంధించిన ప్రతి బాణము నాకు తగిలే అవకాశం ఉంది. కొంత మంది ముందు సారధిని చంపుతారు. కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేనే మరణించవచ్చు. నాకే ప్రమాదము ఎక్కువ. అయినా ఈ పనికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను. కారణం ఇది నా కర్తవ్యం. నేనుచేయాలి.

కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩

BhagavadGeetha

కృతయుగంలో శ్రీరామునిగా మనకు ఎన్నో ఆదర్శాలను బోధించిన శ్రీమహావిష్ణువే, మళ్ళీ ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి ఎన్నో బాధలనూ, కష్టాలనూ అనుభవిస్తూ, మనకెన్నో ధర్మసందేశాలను అందించాడు. శ్రీరాముని కంటే హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు... శ్రీకృష్ణునిది విలాసజీవితం అనుకుంటారు ఎంతోమంది. నిజానికి, శ్రీరాముని కంటే హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. శ్రీరాముని జీవితమే మనకు కష్టాలమయంగా కనిపిస్తుంటుంది. ఈ విషయంపై ఒకసారి దృష్టి సారిద్దాం. శ్రీరాముని శైశవం, బాల్యం బహుసుఖంగానే గడిచాయి. సీతను వివాహమాడిన అనంతరం కొన్నేళ్ళు సుఖంగా జీవించాడు. ఆ తర్వాత 14 సంవత్సరాల అరణ్యవాసం, ఉత్తరకాండలో సీతావియోగం.......ఇవీ శ్రీరామునికి వచ్చిన ముఖ్యమైన కష్టాలు. కొంతకాలం కష్టాలు అనుభవించినా, ఆయన సుఖపడిన సంవత్సరాలు చాలా ఉన్నాయి. ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా, పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు. చూశారా! పురిటికందుకే ఎన్ని కష్టాలో! కేవలం కొన్నిరోజుల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన. అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. శ్రీకృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరమో ఆలోచించండి. ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకరయుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ శ్రీకృష్ణుడే జయించాడు. కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. అనంతరం రుక్మిణిని వివాహమాడేందుకు.. ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ, ఒక హత్యానేరాన్నీ మోశాడు. ఎన్నో కష్టాలు పడి, పరిశోధించి, శమంతకమణిని సాధించి తెచ్చి, తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడేముందు, ఆమె తండ్రియైన జాంబవంతునితో భయంకరయుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు, మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమయింది శ్రీకృష్ణునికి. చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే, చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు. కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా, శ్రీకృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె! శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు. యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగుపెంటలైపోతున్నా, విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. శ్రీకృష్ణుని జీవితం పూలపానుపేమీ కాదు; దారుణమైన ముళ్ళబాట. ఆయన జీవితం కులాసాగా గడిచిందో, అష్టకష్టాలతో గడిచిందో ఈసారి మీరే చెప్పండి. మనకు చిన్న కష్టం వస్తే చాలు, ఎంతో బాధపడి పోతాం. ఆ కష్టాలకు బాధ్యుడు దేవుడేనని నిందిస్తాం. కాని, భగవంతుడు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా మానవరూపం దాల్చి, మానవులకంటే ఎక్కువ కష్టాలూ, సమస్యలూ అనుభవించి చూపించాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాల్లో వందోవంతు కష్టాలు పడిన మానవులు ఎవరైనా ఉన్నారా? నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే! కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే! అనుభవించడం కష్టం. కాని, శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు.

కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩

BhagavadGeetha

ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు ప్రజలను సృష్టించాడు. వెంటనే వారు చేయవలసిన కర్మలను సృష్టించాడు. వాటినే యజ్ఞములు అన్నారు. ఈ యజ్ఞముల ద్వారా అంటే కర్మల ద్వారా వృద్ధిచెందండి అని ప్రజలను ఆదేశించాడు. ఈ యజ్ఞములు మీకు సకలమైన కోరికలు తీరుస్తాయి. ఈ యజ్ఞములు కామధేనువు లాంటివి అని చెప్పాడు. దీనికి సాధారణంగా అర్థం చెప్పుకోవాలంటే ఏ వ్యక్తి అయినా, పుట్టగానే వాడు చేయవలసిన కర్మ కూడా పుడుతుంది. అది మంచి కర్మ కావచ్చు చెడు కర్మ కావచ్చు. ఆ వ్యక్తి తనలో ఉన్న గుణములను బట్టి ఆ కర్మలు చేస్తాడు. ఆ కర్మలు అతనికి కామ ధేనువు వలే తగిన ఫలితములను (మంచి గానీ, చెడు గానీ) ఇస్తాయి. చేసే కర్మలను ఒక దేవతారాధన మాదిరి, ఫలితం ఆశించకుండా చేస్తే ఆనందం, శాంతి కలుగుతుంది. అలా కాకుండా తమ ఇష్టం వచ్చినట్టు చేస్తే సుఖము, దుఃఖము, బంధనములు కలుగుతాయి. మానవులు సృష్టించబడి నపుడు వారి వెంట వారు చేయవలసిన కర్మలు కూడా సృష్టించబడ్డాయి. కర్మలు చేస్తే ఫలములు వస్తాయి. ఆ కర్మఫలములు బంధనములను కలిగిస్తాయి. ఆ కర్మ బంధనములలో చిక్కుకోకుండా ఉండే సాధనములు కూడా వేదములలో శాస్త్రములలో వివరించబడ్డాయి. ఆ సాధనములే యజ్ఞములు. ఆ రోజుల్లో యజ్ఞములను వేదములలో చెప్పబడిన కర్మకాండల ననుసరించి చేసేవారు. కాని ఈ రోజుల్లో యజ్ఞము అంటే సాటి ప్రజలకు ఉపయోగపడే స్వార్ధరహితమైన కర్మ అని అర్థం చెప్పుకోవచ్చు. ఆ కర్మ కూడా భగవంతుని పరంగా చేయాలి పరోపకారం కొరకు చేయాలి. నిష్కామంగా చేయాలి. నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేయాలి. ఇటువంటి కర్మలు కామ ధేనువులు వంటివి. కామధేనువు అంటే కోరిన కోరికలు తీర్చేది. అలాగే ఇటువంటి కర్మలు మంచి ఫలితములను ఇస్తాయి. ఇటువంటి పనులు చేయడం వలన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అనేక దుఃఖముల నుండి విముక్తి కలుగుతుంది. మానవునిలో నైతిక విలువలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ముఖ్యంగా మనసుకు శాంతి కలుగుతుంది. ఈ రోజుల్లో ఎంత ఆస్తి, అంతస్తు, హోదా, పదవి ఉన్నా, ప్రతి వాడికీ మనశ్శాంతి కరువవుతూ ఉంది. అనేక అక్రమాలు చేసి, అవస్థలు పడి సంపాదించిన ధనం అంతా మనశ్శాంతి కోసం ఖర్చుపెడుతున్నారు. ధర్మపరంగా నిష్కామ కర్మలు, ఫలాపేక్షలేకుండా, కర్తృత్వభావన లేకుండా చేస్తే మనశ్శాంతి దానంతట అదే లభిస్తుంది. మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో బతికిన బాబాల చుట్టు తిరగ నవసరం లేదు. ఇక్కడ కర్మలు, యజ్ఞములు అంటే ఇది వరకు అధ్యాయములలో చెప్పబడిన నిష్కామ కర్మ, నిస్వార్థకర్మ, కరృత్వభావనలేని కర్మ, అని అర్థం చేసుకోవాలి.

BhagavadGeetha

యజ్ఞము అంటే మనం సామాన్యం గా వాడుకొనే అర్థం కాదు. మనం యజ్ఞము అంటే అగ్నిహోత్రము, దాని చుట్టు ఋత్విక్కులు కూర్చుని అందులో సమిధలు వేయడం, వేదమంత్రములు వల్లించడం, ఆహుతులు సమర్పించడం, దానిని ఒక క్రియగా చేయడం. కాని ఇక్కడ యజ్ఞము అంటే ఏ కర్మ అయినా లోక హితము కోరకు, స్వార్థమును వదిలిపెట్టి, శ్రద్ధతో, భక్తితో, నిష్కామంగా, ఒక భగవతారాధనగా చేస్తే దానిని కూడా యజ్ఞము అని అంటారు. పైన చెప్పబడిన యజ్ఞయాగములు చాలా వ్యయముతో కూడినవి. కాని ఈ యజ్ఞమునకు ఎటువంటి ఖర్చులేదు. ఎవరైనా చేయవచ్చు. పైన చెప్పినట్టు, ఏ కర్మ చేసినా దానికి లభించే ఫలము బంధనములు కలుగజేస్తుంది అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే సాధారణంగా మానవులు పూజ చేసినా, వ్రతము చేసినా, ఏదో ఒక ఫలితం కోరుకుంటూనే చేస్తారు కానీ ఊరికే చేయరు. ఆ కర్మల వలన పుణ్యం వస్తుంది కానీ ఆ పుణ్య ఫలములను అనుభవించడానికి మరొక జన్మ తప్పదు. అందుకని అసలు పూజలు వ్రతాలు చేయకుండా ఉంటే సరి అని కొందరు అనుకుంటూ ఉంటారు. అది తప్పు అని చెప్పాడు పరమాత్మ. సకామంగా, ఫలమునుకోరి చేస్తేనే, ఆ కర్మ బంధనములు కలుగచేస్తుంది. నిష్కామంగా, పరహితం, సమాజహితం కోరి చేసే కర్మ, ఏ పని చేసినా అది పరమాత్మకు చేసే పూజ అనే భావనతో చేసే కర్మ, ఎటువంటి బంధనములు కలుగజేయదు. క్లుప్తంగా చెప్పాలంటే ఆసక్తితో ఫలము కోరిచేసే కర్మ బంధనములు కలుగజేస్తే, నిరాసక్తంగా, ఏ ఫలము కోరకుండా, వచ్చిన ఫలములు పరమాత్మకు అర్పిస్తే ఆ కర్మ అతనికి ఎటువంటి బంధనములు కలిగించదు. కర్మయోగంలో ఈ యుక్తిని పాటిస్తే ఏ కర్మచేసినా ఎటువంటి బంధనములు కలుగవు. అప్పుడు ఏ కర్మ చేసినా అది భగవంతుని ఆరాధన అవుతుందేతప్ప బంధనము కాదు. అటువంటి కర్మలు మనసును నిర్మలం చేసి మోక్షానికి మార్గం చూపుతాయి. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మనం ఏ పని చేసినా, అది చదువుకానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ ఏది చేసినా ఒక యజ్ఞంలాగా చేయాలి. యజ్ఞము అంటే శ్రద్ధతో చేసే కర్మ, భగవంతుని పరంగా చేసే కర్మ. దీనిని యజ్ఞము అని అంటారు. కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధతో, భగవంతుని పరంగా, ఫలితాన్ని ఆశించ కుండా, ఆ పని నేను చేస్తున్నాను అని ఆసక్తి లేకుండా, సమాజహితంకోరి చేస్తే ఆ కర్మ యజ్ఞముతో సమానము. దానివలన ఎటువంటి బంధనములు కలుగవు. అలా కాకుండా ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది నేనే చేస్తున్నాను. ఈ పని నేను తప్పవేరే ఎవరూచేయలేరు. ఈ పనికి కర్త కర్మ క్రియ అంతా నేను అనే అహంకారంతో చేస్తే ఆ పని తప్పకుండా బంధనాలను కలుగజేస్తుంది. ఆ పని చేసిన మానవుడు బంధనములలో చిక్కుకుంటాడు.

BhagavadGeetha

మనము కర్మలను భగవత్ అర్పితముగా చేయకపోతే, మన ఇంద్రియ మనస్సుల సంతృప్తి కోసం పని చేయవలసి వస్తుంది. అలా కాకుండా, పనులను యజ్ఞం లాగా చేస్తే, మనం సమస్త ప్రపంచాన్ని, దానిలో ఉండే ప్రతిదాన్ని భగవత్ సంబంధంగా చూసి, అవి పరమాత్మ సేవలోనే ఉపయోగపడాలని భావిస్తాము. శ్రీ రామ చంద్రుడి పూర్వీకుడైన రఘు మహారాజు ఈ విషయంలో ఒక చక్కటి ఆదర్శం చూపించాడు. రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేసాడు, దానిలో తనకున్న సంపదనంతా దానం చేయవలసి ఉంటుంది.
స విశ్వజితం ఆజహ్ర్ఏ యజ్ఞం సర్వస్వ దక్షిణం
ఆదానం హి విసర్గాయ సతాం వారిముచాం ఇవ (రఘువంశము 4.86)
"మేఘములు పృథ్వి నుండి నీటిని గ్రహించటం, వాటి స్వప్రయోజనం కోసం కాకుండా, మళ్లీ ఈ పుడమి పైనే వర్షించటం కోసమే అన్నట్టుగా, ఒక మహారాజుగా తను పన్నుల రూపంలో ప్రజలనుండి సంపాదించినదంతా తన భోగాల కోసం కాకుండా, భగవంతుని ప్రీతి కోసమే అన్న భావనతో రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేసాడు. కాబట్టి తన ఐశ్వర్యాన్నంతా దేవుని ప్రీతి కోసం తన ప్రజల సేవలో వినియోగించాలని నిర్ణయించాడు." యజ్ఞం పరిపూర్తి అయిన తరువాత రఘువు తనకున్నదంతా ప్రజలకు దానం చేసేసాడు. ఆ తర్వాత, ఒక యాచకుడిగా చిరుగు వస్త్రాలతో, మట్టి పాత్ర పట్టుకుని, తిండి కోసం యాచించటానికి బయలుదేరాడు. ఓ చెట్టు క్రింద విశ్రాంతి తీస్కుంటుండగా, కొంత మంది ఇలా మాట్లాడుకోవటం విన్నాడు. "మన మహారాజు ఏంతో దయకలవాడు. తన కున్నదంతా దానం చేసాడు" అని. రఘువు కి తన పొడగ్త విని చాలా బాధ పడి ఇలా అన్నాడు. “మీరు ఎమి మాట్లాడుకుంటున్నారు?” వారు ఇలా అన్నారు, “మేము మా రాజు గారి గొప్పతనం చెప్పుకుంటున్నాము. ఆయనంత దానశీలురు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు.” రఘువు దీనికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. “ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకండి. రఘువు ఏమీ ఇవ్వలేదు.” వారు అన్నారు, “ఎలాంటి మనిషివి నువ్వు మా రాజు గారిని విమర్శిస్తున్నావు? అందరికీ తెలుసు రఘు మహారాజు తన సంపాదనంతా దానం చేసాడని.” రఘువు అన్నాడు “వెళ్లి మీ రాజుని అడగండి, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమైనా ఉందా ఆయన దగ్గర అని? ఆయన ఉత్త చేతులతో పుట్టాడు. కాదా? మరి ఆయనది ఏమి ఉందని ఆయన ఇచ్చినట్టు? ” కర్మ యోగ దృక్పథం అంటే ఇదే, ఈ దృక్పథం లో మొత్తం ప్రపంచాన్ని భగవంతుని సొత్తు గా మనం చూస్తాము మరియు దేవుని ప్రీతి కోసమే ఉందనుకుంటాము. అప్పుడు మనము మన విధులను మన ఇంద్రియ, మనస్సు ల తృప్తి కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసం చేస్తాము.

BhagavadGeetha

ఎవరైతే తనలో తాను అంటే తన ఆత్మలో తాను రమిస్తూ ఉంటాడో, దొరికిన దానితో తృప్తి చెందుతుంటాడో, అతడు నిత్యము సంతుష్ఠిగా ఉంటాడు. అటువంటి సాధకుడికి చేయవలసిన కర్మ అంటూ ఏదీ ఉండదు. అటువంటి వారికి ఈ ప్రపంచములో కర్మల చేయడం వలనకానీ, చేయకుండా ఉండటం వలన గానీ, ఎటువంటి ప్రయోజనము లేదు. అటువంటి సాధకుడికి స్వార్ధబుద్ధి కానీ, బాహ్యప్రపంచముతో సంబంధము కానీ ఉండదు. తమ మనస్సును పరమాత్మయందు చక్కగా ఉంచిన వారు. మనస్సును ఆత్మయందు కలిపి రమించేవారు, తమలో తాము ఆత్మానందాన్ని అనుభవించేవారు, ఉన్నదానితో తృప్తిగా జీవించేవారు, సాంఖ్యులు, జ్ఞానులు అంటే ఆత్మజ్ఞానము కలవారు, బయట ప్రపంచంలో తిరుగుతున్నా ప్రాపంచిక విషయములచేత ప్రభావితం కాని వారు, ఇంద్రియములను మనసును నిగ్రహించిన వారు, అటువంటి వారు జీవన్ముక్తులు. ఒకసారి ఆత్మసాక్షాత్కారము కలిగిన తరువాత అటువంటి వారికి ఈ ప్రపంచంలో చేయవలసినపని అంటూ ఏమీ ఉండదు. అటువంటి వారు కర్మలు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. చేయడం వలన ప్రయోజనం కానీ, చేయక పోవడం వలన నష్టం కానీ ఏమీ ఉండవు. అటువంటి జీవన్ముక్తుడు నిర్వికారంగాఉంటాడు. ఎందుకంటే అతడు ఆత్మయందే తృప్తిని పొందుతున్నాడు. అతడికి కావాల్సింది అంటూ ఏమీ లేదు. కొత్తగా సాధించేది ఏమీ లేదు. లోకోపకారార్థం కర్మలు చేస్తాడు. లేకపోతే లేదు. అతడికి కర్మలు చేయాలి అన్న నిబంధన ఏమీ లేదు. అటువంటి వాడు ఈ ప్రపంచములో ఎవరినీ ఆశయించడు. ఎవరి ఆశయమూ అతడికి అక్కరలేదు. అతడు ఎవరి మీదా ఆధారపడడు.

BhagavadGeetha

సామాన్య మానవులు ప్రాపంచిక విషయములు కావాలని కోరుకుంటూ, వాటి కోసం కర్మలు చేస్తూ, అవి దొరికితే తృప్తిపడుతుంటారు. జీవన్ముక్తులు కేవలం తమలో తాము తృప్తిపడుతుంటారు. ప్రాపంచిక విషయముల యందు ఏ మాత్రము ఆసక్తి చూపరు. అటువంటి స్థిత్రపజ్ఞుడికి జీవన్ముక్తుడికి ఈ ప్రపంచంలో చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు. అటువంటి వారు కోటికి ఒకరు ఉంటారు. మిగిలిన వారందరూ తమకు విధించిన కర్మలు చేయవలసినదే. ఆత్మయందే రమించేవారు. ఆత్మయందు తృప్తి పొందేవారు, ఏ కర్మలను చేసినా చేయనట్టే ఉంటారు. కాని వారిని చూచి సామాన్య జనులు కూడా వారిలా ఉందామని అనుకోవడం చాలా పొరపాటు. ఎలాగంటే, ఒక ఉపాధ్యాయుడు జీవితాంతం విద్యార్థులకు పాఠాలు చెప్పి, వారిని సన్మార్గంలో పెట్టి, ప్రయోజకులను చేస్తాడు. తుదకు వయసు మీదపడగానే రిటయిర్ అవుతాడు. పెన్షన్ తీసుకుంటూ సుఖంగా జీవిస్తాడు. అటువంటి వారిని చూచి, ఆయన ఊరికే పెన్షన్ తీసుకుంటూ హాయిగా ఉన్నాడు, మేము కూడా అలాగే పనీపాటా లేకుండా సుఖపడతాము అని విద్యార్థులు యువకులు అనుకుంటే వారి జీవితం కష్టాలపాలవుతుంది. రిటయిర్ అయిన తరువాత కూడా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులకు సాయం చేయాలనే కోరికతో ఉచితంగా విద్యాబోధన చేస్తుంటారు. దాని వలన వారికి ఎటువంటి బంధములు అంటవు. కాబట్టి అందరూ కర్మలు ఆచరించాలి. కర్మలు వదిలిపెట్టకూడదు. నిష్కామ కర్మలు ఆచరించడం ద్వారా జ్ఞానము సంపాదించి దాని తరువాత మోక్షమునకు అర్హులవుతారు. ఆ స్థితిని పొందిన తరువాత, వారు కర్మలు చేసినా చేయకపోయినా ఒకటే. ఎటువంటి స్వార్ధబుద్ధిలేకుండా, లోక కల్యాణం కొరకు వారు చేసే కర్మలను తప్పుపట్టకూడదు. కాని ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రాపంచిక విషయములలోనూ, విషయవాంఛలలోనూ మునిగి తేలుతున్నారు. చేయవలసిన కర్మలను వదిలిపెట్టి చేయకూడని కర్మలు చేస్తున్నారు. తాము చేసిన కర్మలతో కూడా వారు తృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని నిరంతరం ఆరాటపడుతుంటారు. దాని వలన వారికి ఏ లాభమూ లేకపోగా బంధనములు వాసనలు చుట్టుకుంటాయి. ఎవరైతే బాహ్య ప్రపంచములో లభించే సుఖములు నిజం కావు నిజమైన సుఖం ఆత్మానందమే అని అనుకుంటారో అప్పుడే వారికి విముక్తి. అప్పటి వరకూ విద్యుక్త కర్మలు ఇతరులకు ఉపయోగించే కర్మలు నిష్కామకర్మలు చేయాల్సిందే. ఆత్మారాములు కర్మ చేసినా కర్మ చేయకపోయినా వారికి వచ్చే లాభం కానీ జరిగే నష్టంకానీ ఏమీ లేదు. వారు పూర్ణకములు అనగా అన్ని కోరికలు తీరినవారు. కోరడానికి ఆ కోరికలు తీరడానికి వారికి ఏమీ మిగలలేదు. వారు కర్మలు చేయకపోయినా నష్టం లేదు. అతనికి అన్నీ సమానమే. నిరంతరము ఆత్మయందు రమించే వాడికి బాహ్య కర్మల వలన ఏం ప్రయోజనం చేకూరుతుంది. అటువంటి జీవన్ముక్తుడు కావాలంటే కర్మలు చేయగలడు. లేకపోతే మానగలడు.

BhagavadGeetha

కర్మ దాని లక్షణాలు, ఎవరు కర్మలు చేయాలి, ఎవరు కర్మలు చేయకుండా ఉండవచ్చు అనే విషయాలను చెప్పిన తరువాత కృష్ణుడితో ఇలా అన్నాడు. అర్జునా! నీ విద్యుక్త ధర్మము నీ క్షత్రియ ధర్మము నీవు నెరవేర్చు. ఏ కోరికా లేకుండా యుద్ధం చెయ్యి. ఎవరికో ఏదో జరుగుతుందని బాధపడకుండా యుద్ధం చెయ్యి నిష్కామంగా యుద్ధం చెయ్యి ఏ సంగమం లేకుండా యుద్ధం చెయ్యి. ఎదురుగా ఉన్న వాళ్లు నీ బంధు మిత్రులు అన్న భావన లేకుండా యుద్ధం చెయ్యి. నేను యుద్ధం చేస్తే ఏమవుతుందో! అలా జరుగుతుందో! ఇలా జరుగుతుందో! నావల్లే అంతా జరుగుతోంది.... అనే ఆలోచనలు లేకుండా యుద్ధం చెయ్యి. నీ ఒక్కడి వల్ల ఏమీ కాదని నీ తెలుసుకొని యుద్ధం చెయ్యి మనస్సును నిర్మలంగా ఉంచుకొని యుద్ధం చెయ్యి. అప్పుడు నీకు ఎటువంటి పాపము అంటదు. కర్మ చేయకుండా ఉండటానికి నీవు ఇంకా ఆత్మజ్ఞానివి కాలేదు. జీవన్ముక్తుడువి కాలేదు. ఇంకా కర్మలు చేసే దశలోనే ఉన్నావు. నీకు ఆత్మజ్ఞానం ఇంకా అలవడలేదు. ఇప్పుడే సన్యాసం తీసుకుంటాను అంటేకుదరదు. నేనేం నిన్ను చేయకూడని పని చేయమనడం లేదు. నీ కర్తవ్యం నిర్వర్తించమంటున్నాను. నీవు క్షత్రియుడివి కాబట్టి నీ ధర్మం నిర్వర్తించమంటున్నాను. కాకపోతే నిష్కామంగా, ఆసక్తి లేకుండా, ఫలా పేక్ష లేకుండా, ధర్మం కొరకు యుద్ధం చేయమంటున్నాను. అలా చేస్తే నీకు ఎటువంటి బంధనములు అంటవు. అప్పుడు నీ అంతరంగము శుద్ధి అవుతుంది. తరువాత జ్ఞానం వస్తుంది. తరువాత మోక్షం లభిస్తుంది. కాబట్టియుద్ధం చెయ్యి. ఎటువంటి సంగము అంటే అటాచ్మెంట్ లేకుండా, ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా, నిష్కామంగా కర్మలు చేస్తే దాని వలన సుఖదుఃఖములు, బంధములు రావు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిర్మలంగా ఉంటుంది. అటువంటప్పుడు పరమాత్మను ధ్యానించడానికి ఆత్మదర్శనం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇదే కర్మలు చేయడంలో రహస్యము. కాబట్టి కర్మలు చేస్తూ కూడా ఆత్మసాక్షాత్కారము పొందవచ్చు. మనసును ఆత్మలో లీనం చేయవచ్చు. పరమశాంతిని పొందవచ్చు. కేవలం వేదములు శాస్త్రములు చదివి జ్ఞానం సంపాదించడమే కాదు. కర్మలు ఆచరిస్తూ కూడా ఆత్మజ్ఞానం పొందవచ్చు. చివరకు మోక్షం కూడా పొందవచ్చు. ఇదే గీతాబోధ.

BhagavadGeetha

పూర్వము జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను చేయడం వలన సిద్ధిపొందారు. కావున నీవు కూడా స్వార్థం వదిలిపెట్టి లోకహితము కొరకు కర్మలు చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉన్నది. ఇప్పుడు కృష్ణుడు ఒక ఉదాహరణ చెబుతున్నాడు. జనకుడు, అశ్వపతి మొదలగు మహారాజులు ఎటువంటి ఆసక్తి లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించి సిద్ధి పొందారు. అని అన్నాడు. ఇక్కడ జనకుడు మొదలగు వారిగురించి చెప్పడంలో అర్థం వారు ఋషులు కారు, మునులు కారు, సన్యాసులు కారు, సర్వసంగ పరిత్యాగులు కారు. వారు కూడా అర్జునుడి మాదిరి క్షత్రియులు, రాజ్యపాలన చేసారు. అటువంటి వారు కూడా ఆసక్తి లేకుండా, నిష్కామంగా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, కర్మలు చేసి సిద్ధిని పొందారు. వారి మాదిరే అర్జునుడిని కూడా తన విద్యుక్త కర్మ అయిన యుద్ధము చేయమని కృష్ణుడు బోధించాడు. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలగు చక్రవర్తులు ఈ కోవలోకి వస్తారు. వారికి ఈ ప్రపంచంలో చేయవలసినది అంటూ ఏదీ లేదు. కాని లోకం కొరకు తమ కర్తవ్య కర్మలు నిర్వర్తించారు. కరృత్వ భావం లేకుండా, నిష్కామంగా కర్మలు చేసారు. అలా చేసి వారు ముక్తిని పొందారు. వారందరూ కర్తవ్య కర్మలు చేసి ముక్తిని పొందిన వారే! కాబట్టి ఓ అర్జునా! వారి మాదిరి నీవు కూడా సంగముక్తుడివి, జీవన్ముక్తుడివి అని నీవు అనుకుంటే కూడా, లోకం కోసమన్నా, నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు. జనకుని మాదిరి నీ కర్తవ్య కర్మలను చెయ్యి. ఏ విధమైన సంగం లేకుండా యుద్ధం చెయ్యి పోనీ, జనకుడు, అశ్వపతి జ్ఞానులు, జీవన్ముక్తులు కారు అని అనుకొందాము. నీమాదిరి మామూలు మానవులు అనుకొందాము. అలాంటప్పుడు కూడా వారు నిష్కామంగా కర్మలు చేసి జ్ఞానమును సంపాదించి, చివరకు ముక్తిని పొందారు కాబట్టి, అదే పని నీవూ చెయ్యి ఇందులో తప్పేముంది. ఎలా చూచినా నీవు నీ కర్తవ్య కర్మ చేయక తప్పదు కదా! నీవు జీవన్ముక్తుడివి, నీకు అన్నీ తెలుసు నీకు కర్మచేయనవసరం లేదు అని నీవు అనుకున్నాకూడా, నీ కోసం కాకపోయినా జనం కోసం అయినా, వారిని మంచి దారిలో పెట్టడానికైనా నీవు కర్మలు చేయాలి కదా. అర్జునుడే యుద్ధం చేయలేదు మేం మాత్రం ఎందుకు యుద్ధం చేయాలి అని నీ సైనికులు అనుకుంటే మిగిలిన వీరుల గతేం కావాలి. కాబట్టి ఇతరులకు మార్గదర్శకంగా ఉండటానికైనా నీవు యుద్ధం చేయక తప్పదు. ఇదీ కృష్ణుడి ఆర్యుమెంటు. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు మొదలగు చక్రవర్తులందరూ జీవన్ముక్తులే కానీ కర్మలు చేసారు. ఎవరి కోసం? ఇతరులు కోసం, ఇతరులను మంచి మార్గంలో పెట్టడం, ఇతరులకు మార్గదర్శకంగా ఉండటం కోసం చేసారు.

BhagavadGeetha

యథారాజా తథా ప్రజా అనే మాటకు అన్వయం.. పెద్దవాళ్లు ఏది ఆచరిస్తారో, వారిని చూచి చిన్నవాళ్లు అదే ఆచరిస్తారు. కాబట్టి చిన్నవాళ్లను మంచి దారిలో పెట్టడానికి పెద్దలు వారికి నిర్దేశించిన కర్మలను చేయక తప్పదు. మామూలు ప్రాపంచిక విషయములలో కానీ, ఆధ్యాత్మిక విషయములలో గానీ, పెద్దలు పిన్నలకు మార్గదర్శకంగా ఉండాలి. పెద్దలే తప్పు చేస్తే పిల్లలు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. కాబట్టి పెద్దలు కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఎప్పుడూ పెద్దలను రోల్ మాడల్ గా ఊహించుకుంటారు. పెద్దలు శాస్త్ర విరుద్ధముగా ప్రవర్తించకూడదు. అర్జునుడు విషయానికే వద్దాము. అర్జునుడు శౌర్యవంతుడు, ధీరుడు, పరాక్రమ వంతుడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు ఇంద్రుని అర్థసింహాసనము మీద కూర్చున్నాడు. అటువంటివాడు ఈ ప్రకారంగా దౌర్బల్యస్థితిలో యుద్ధం చేయనంటే ఇతరులు కూడా దానినే అనుసరిస్తారు. అందరూ విల్లు అమ్ములు కిందపడేసి ఇంటికి పోతారు. అలా కాకుండా అర్జునుడు క్షత్రియ ధర్మమును ఆచరిస్తూ, తన బల పరాక్రమములు ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తే, యువకులు కూడా ఆయననే అనుసరిస్తారు. కాబట్టి పెద్దవారు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో పిల్లలు దానినే ప్రమాణంగా తీసుకుంటారు. పెద్దవారు వేదమునే ప్రమాణంగా పాటిస్తే, పిల్లలు కూడా వారిని అనుసరిస్తారు. ఆ కారణం చేతనే వేదవిద్య, సనాతన ధర్మములు పరంపరానుగతంగా, ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తూ ఈ నాటికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జీవన్ముక్తులు, జ్ఞానులు, ఆత్మసాక్షాత్కారం పొందిన వారుకూడా, వారికి ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా, లోక కల్యాణం కొరకు కర్మలు చేస్తుంటారు. వారిని అనుసరించడం మన విధి. జగద్గురువు శంకరాచార్యుల వారు జీవన్ముక్తుడు. కాని ఆయన దేశం అంతా కాలి నడకన తిరిగారు. ధర్మప్రచారం చేసారు. మానవులకు ఉపయోగించే ఎన్నోగ్రంధాలు రాసారు. ఎందుకు. తన కోసం కాదు. లోక కల్యాణం కోసం. అవి నేడు మనకు మార్గదర్శకాలు అవుతున్నాయి. కేవలము వేదములు శాస్త్రములు చదివినంతనే ప్రయోజనము లేదు. వాటిలో ఉన్న ధర్మములను పెద్దలు తాము ఆచరించి చూపించి, భావి తరాలకు మార్గదర్శకం కావాలి. ఇందులో ప్రమాణము అని వాడారు. ప్రమ అంటే ఉన్నది ఉన్నట్టు చూసే బుద్ధి. .దానికి వికృతి భ్రమ. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే బుద్ధి. మనం అంతా ఎల్లప్పుడూ భ్రమలో ఉంటాము. తాడును చూసి పాము అనుకుంటూ ఉంటాము. ప్రాపంచిక సుఖములు సత్యములు శాశ్వతములు అనే భ్రమలో వాటి వెంట పరుగెడుతుంటాము. కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలియజేసేదానిని ప్రమాణము అని అంటారు.

BhagavadGeetha

వేదాంత పరంగా చెప్పాలంటే, కర్మ అంటే కేవలం చేతులు కాళ్లు కదుపుతూ చేసే యాంత్రికమైన పని కర్మ కాదు. సక్రమంగా చేసే పని కర్మ అంటారు. సక్రమము అంటే సత్వగుణ ప్రధానము. ఏ కర్మ అయితే భౌతికమైన ఫలితం తో పాటు ఆధ్యాత్మికంగా మనకు లాభం చేకూరుస్తుందో, ఏకర్మ వ్యక్తిగత శ్రేయస్తే కాకుండా, సమాజ శ్రేయస్సుకూడా కలిగిస్తుందో, ఏ కర్మలో ధర్మముతో కూడిన అర్థము, కామము ఎక్కువగా ఉంటాయో, అదే సత్వగుణ ప్రధానమైన సాత్విక కర్మ. ఈ సాత్విక కర్మను, సాత్వికమైన బుద్ధితో ఆచరించడమే యోగము. అంటే ఏ పని చేసినా నేను చేస్తున్నాను అని కాకుండా, పరమాత్మ కొరకు ఈ పని చేస్తున్నాను అనే భావనతో చేయడం. చేసే ప్రతి పని దేవుని పూజ (వర్క్ ఈజ్ వర్షిప్) అనుకుంటూ చేయడం. ఆ కర్మయొక్క ఫలితాన్ని పరమాత్మకు అర్పించడం. దానినే కర్మయోగము అంటారు. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ బంధనములు అంటవు. సాధారణంగా పూజలు, వ్రతాలు, సత్మర్మలు చేసిన తరువాత ఆఖరున ఈ కింది మంత్రమును చదువుతాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధా త్మానా వా ప్రకృతే స్వభావాత్ రోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నేను నా శరీరముతో కానీ, మాటలతో కానీ, మనసుతో కానీ, బుద్ధితో కానీ, ప్రకృతి స్వభావంగా గానీ, ఏ కర్మచేసినా ఆ కర్మలన్నీ నారాయణుడికి సమర్పిస్తున్నాను. ఈ శ్లోకం మనం సంధ్యావందనంలో కూడా ఆఖరున చదువుకుంటాము. కానీ అర్థం తెలియదు. ఆ శ్లోకము యొక్క అర్ధమే భగవద్గీతలో భగవానుడు చెబుతున్నాడు. అప్పుడు మనం చేసిన కర్మకు ఎటువంటి ఫలితం వచ్చినా దానిని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాము. సుఖము దుఃఖము సమానంగా అనుభవిస్తాము ఎందుకంటే అది భగవంతుని ప్రసాదం కాబట్టి. ఈ నేపథ్యంలో మనం రాబోయే శ్లోకాలు అర్థం చేసుకోవాలి. ప్రతి వాడికీ తాను ఏమి చేయాలో తనకు తెలియదు. అందుకని శాస్త్రములను ఆశ్రయించాలి. అందులో చెప్పినట్టు చేయాలి. అందుకని కృష్ణుడు ఇలా అన్నాడు. "అర్జునా! నేను యుద్ధము చేయను, భిక్షాన్నము తింటాను, సన్యాసం తీసుకుంటాను అని నీవు అన్నావు. కాని అవి క్షత్రియధర్మములు కావు. శాస్త్ర సమ్మతములు కావు. నీకు నియమింపబడిన కర్మ యుద్ధం చేయడం. ఏ కర్మాచేయకుండా సన్యాసము తీసుకోడం కంటే నీ స్వధర్మమయిన యుద్ధం చేయడం ఎంతో మేలు. నీవు యుద్ధం చేయపోతే నీకు తోచదు. నీవు ప్రశాంతంగా జీవించలేవు. నేను చేస్తున్నాను. అనే అహంకారం లేకుండా, నిష్కామంగా, సమాజహితం కోరి, ఈ యుద్ధం చెయ్యి.. నా వాళ్లందరూ మరణిస్తారు అనే ఫలాపేక్షలేకుండా, యుద్ధం చెయ్యి. ఫలితం పరమాత్మకు అర్పించు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే నీవు నీ మందిరంలో చేతులు ముడుచుకొని కూర్చోలేవు. అది నీ తరం కాదు. నీ దేహం నీకు సహకరించదు. ఎందుకంటే యుద్ధం చేయడం

BhagavadGeetha

ఒకడు అజ్ఞాని, వాడికి ఏమీ తెలియదు. శాస్త్ర జ్ఞానము లేదు. వాడు ఈ ప్రపంచంలో తిరుగుతుంటాడు. కర్మలు చేస్తుంటాడు. కాని వాడి మనసు వాడి అధీనంలో ఉంటుంది. బుద్ధి చెప్పిన మాట వింటుంది. చేసే కర్మల ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తాడు. అటువంటి వాడు, అన్ని శాస్త్రములు చదువుకొన్నప్పటికీ, మనసును అదుపులో ఉంచుకోలేని సన్యాసి కన్నా గొప్పవాడు. ఎందుకంటే.. మన అవయవాలు అంటే ఇంద్రియాలు జడపదార్దాలు. అవి మనసు ఎలా చెబితే అలా చేస్తాయి. మనస్సు యొక్క ఆజ్ఞలను పాటించడమే వాటి పని. మనసు బుద్ధి అలా కాదు. వాటికి ఆలోచించే శక్తి ఉంది. మంచి చెడు విచక్షణ ఉంది. ఇంద్రియముల చేత మంచి పనులు చేయించే బాధ్యత మనసుది. అదే పెడదారి పడితే మానవుడు ఎన్ని శాస్త్రములు చదువుకున్నా, పతితుడవుతాడు. దానికి మనసు చేయవలసిన పని, ఇంద్రియములను అదుపులో పెట్టడం, నిష్కామంగా కర్మ చేయడం, ఫలితాన్ని ఆశించకుండా కర్మచేయడం. నేను ఈ పని చేస్తున్నాను అనే భావన లేకుండా అంటే కర్తృత్వభావన లేకుండా కర్మచేయాలి. కాని ఇపటి సన్యాసులు మాత్రం అంతా తమ మీదనే నడుస్తూ ఉందని ఫీల్ అవుతుంటారు. అన్నిటికీ తామే కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తుంటారు. వీరు పేరుకే సన్యాసులు కాని విశిష్ట వ్యక్తులు కారు. వీరంతా దంభాచారులు, కపటులు. అసలు కర్మయోగి ఎవరంటే మనసుతో ఇంద్రియములను అదుపులో ఉంచుకొని, ఆ అదుపులో ఉన్న ఇంద్రియములతో కర్మలు చేసేవాడు. కర్మఫలమును ఆశించని వాడు. ఎల్లప్పుడూ తన మనసును భగవంతుని యందే లగ్నం చేసే వాడు. అటువంటి వాడు సంసారి అయినా, సన్యాసి అయినా ఒకటే. ఈ ప్రపంచంలో తిరుగుతూ కర్మలు చేస్తున్నా, తామరాకు మీది నీటి బొట్టు మాదిరి సంచరిస్తుంటాడు. అతడే శ్రేష్ఠుడు.

BhagavadGeetha

శరీరము, శరీర అవయవాలనే కాదు, మనసును కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియములు మనసు చెప్పినట్టు వినాలి కానీ, ఇంద్రియములు చెప్పినట్టు మనసు వినకూడదు. అటువంటి నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామ కర్మలు చేయాలి. చేస్తున్న పనికి ఫలితం ఆశించకూడదు. అప్పుడు ఆ కర్మ బంధనమలు అతనిని అంటవు. కర్మల పట్ల ఆసక్తి, విషయవాంఛలు, మనసులో నుండి బయటకు నెట్టాలి. నిష్కామంగా, ఏ కోరికా లేకుండా, ఫలం ఆశించకుండా, నేను చేస్తున్నాను అనే అహం లేకుండా ఏ పని చేసినా, ఆ కర్మలు అతనిని బంధించవు. అటువంటి కర్మలు చేసేవాడు విశిష్యతే అంటే శ్రేష్ఠమైనవాడు అని పిలువబడతాడు. నేను జ్ఞానిని, నేను ధ్యానం చేస్తున్నాను అంటూ కాషాయాలు కట్టుకొని, కళ్లు మూసుకొని కూర్చుని, మనసులో విషయవాంఛల గురించి ఆలోచించేవారి కంటే, తనకు విధింపబడిన కర్మలను, తనచే నిగ్రహింపబడిన ఇంద్రియములతో, నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా, అహంకారంలేకుండా చేసే వాడు ఎంతో ఉత్తముడు.

BhagavadGeetha

జ్ఞానోదయమైన వ్యక్తి తన మనస్సులోనికి ప్రాపంచిక బలహీనతలైన, కామము, క్రోధం, లోభం, ఈర్ష వంటివాటిని రానివ్వడు. అప్పుడే మనస్సు భగవంతుని ధ్యాసలో స్థిరంగా ఉండగలదు. మనస్సుని దుఃఖాల గురించి చింతించటానికి అనుమతి నిస్తే భగవత్ ధ్యాస ఆగిపోయి, ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగి వేయబడుతుంది. చిత్రహింస అంటే ఇలాగే ఉంటుంది. ప్రస్తుత బాధ కన్నా, పాత హింసల బాధ జ్ఞాపకాలు, ఇకముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఎప్పుడైతే మనస్సు ఈ రెంటినీ వదిలి వేసి, ప్రస్తుత వేదనని తట్టుకొవటానికి ప్రయత్నిస్తే, బాధ ఆశ్చర్యంగా బాగా తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయి లోనే ఉంటుంది. మన పురాణాల్లో, చరిత్రలో ఋషులు మునులు, సన్యాసులు, ఇటువంటి పద్దతుల ద్వారానే రాక్షకులు, శత్రువుల చిత్రహింసలను తట్టుకునేవారు. ఈ విధంగానే, బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడు, అది ఆయా భోగ వస్తువుల కోసం పరుగులు పెడుతుంది, దీనితో మనస్సు భగవత్ ధ్యాస నుండి మరలి పోతుంది. కాబట్టి, సుఖాల కోసం వెంపర్లాడకుండా, దుఃఖాల వల్ల చింతించకుండా మనస్సుని కట్టడి చేసినవాడు స్థిత ప్రజ్ఞుడైన ముని. ఇంకా, అటువంటి యోగి, భయము, కోపము వంటి వాటికి తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు. ఈ విధంగా మనస్సు సర్వోత్కృష్టమైన స్థితిలోనే ఉంటుంది.

BhagavadGeetha

మనస్సులో సమత్వం లేకపోతే అది ఆలోచించలేదు. మనస్సు పనిచేయడం మానేస్తుంది. అంతేకానీ దేవుడు గొప్పవాళ్లకు ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు నాకు తక్కువ తెలివి ఇచ్చాడు అని అనడం వివేకంకాదు. పరమాత్మ అందరికీ ఒకే విధమైన మెదడు, బుద్ధి, ఆలోచనా శక్తి ఇచ్చాడు. కాని దానిని మనం సక్రమంగా వినియోగించడం లేదు. కొంత మంది అసలు వినియోగించరు. మన ఆలోచనలన్నీ ధనం సంపాదించడం, సుఖాలు అనుభవించడం వీటి చుట్టుతిరుగుతుంటాయి. ముఖ్యంగా స్త్రీలు టివి సీరియళ్లు చూచి ఆ సీరియళ్ల గురించి ఆలోచిస్తూ ఆ కష్టాలన్నీ తాము మానసికంగా అనుభవిస్తూ మానసిక ఆందోళనకు గురి అవుతుంటారు. దానివలన మనసు ఎప్పుడూ ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. నేటి యువతరం కూడా ఎక్కువగా సినిమాలు చూస్తూ, ప్రేమ వ్యవహారాలలో, రాజకీయాలలో మునిగితేలుతూ వాటి గురించే ఆలోచిస్తూ, చదువు మీద ఏకాగ్రతను కోల్పోతున్నారు. సుఖం వచ్చినపుడు ఎగిరెగిరిపడటం ఆనంద పడటం, దుఃఖం వచ్చినవుడు కుంగి పోవడం చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది. దీనికి విరుగుడు సమత్వం. సుఖదుఃఖాలను సమంగా భావిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో గానీ, వ్యాపారంలోగానీ, ఉద్యోగంలో కానీ, ఇంటి విషయాలలో కానీ రాణించగలడు.

BhagavadGeetha

కర్మలను నిష్కామంగా ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా చేయాలి. నిశ్చయాత్మకమైన బుద్ధితో చేయాలి. సమత్వ బుద్దితో చేయాలి అంటే ఆకర్మకు మంచి ఫలం వచ్చినా చెడ్డ ఫలం వచ్చినా ఒకే విధంగా స్పందించాలి. చేయ బోయే కర్మ సిద్ధిస్తుందో సిద్ధించదో అనే సందేహము పనికిరాదు. చిత్తశుద్ధితో కర్మలను చేయాలి. పైన చెప్పిన విధంగా కర్మలను చేస్తే వాడికి జ్ఞానం కూడా కలుగుతుంది. వాడిలో ఉన్న అజ్ఞానం అవివేకము తొలగిపోతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రకారంగా నిష్కామ కర్మలను చేయడం వలన వాడికి పాపము అంటదు. పుణ్యము రాదు. వాడిలో సుకృతము ఉండదు. దుష్కృతము ఉండదు. సమంగా ఉంటాడు. ఈ సమత్వ బుద్ధి కలిగి ఉండటమే జ్ఞానము. అంటే వాడికి తాను చేసిన కర్మలవలన అటు పాపమూ రాదు ఇటు పుణ్యమురాదు. ఎందుకంటే నిష్కామంగా పనులు చేసినపుడు ఈ పని నేను చేస్తున్నాను అనే కర్తృత్వభావము ఉండదు. అహంకారము ఉండదు. ఏ పని అయినా నీవు చేసినట్టు పైకి కనిపించినా ఆపని నీవు చేయడం లేదు. అందరి సమిష్టికృషి అని తెలుసుకోగలుగుతావు. అటువంటప్పుడు నేను చేసాను అనే అహంకారము కర్తృత్వ భావన ఉండదు కాబట్టి ఆ కర్మకు సంబంధించిన పాప పుణ్యములను నావి అని అనుకోడు. అందువలన వాడికి ఆ కర్మ తాలూకు పాపపుణ్యములు అంటవు. ఎలాగంటే, నీవు ఆ పని చేయాలి కాబట్టి ఆ పని చేయడం నీ ధర్మం కాబట్టి, శ్రద్ధాభక్తులతో ఆపని చేస్తావు. కాని నీవు పుణ్యపాపములకు అతీతంగా ఉంటావు. అదే జ్ఞానము.

BhagavadGeetha

బుద్ధియుక్తులు అంటే సమ బుద్ధి కలవారు. జ్ఞానులు వివేకులు. మానసిక ఎదుగుదలను సాధించిన వారు, కుశలత్వంతో కర్మలను చేసేవారు. కర్మలను శ్రద్ధతో చేసేవారు. ఎటువంటి ఆసక్తితో చేయని వారు. కర్మఫలముల మీద ఆసక్తి లేని వారు. అటువంటి వారు ఎల్లప్పుడూ శాంతితో ఉంటారు. వారికి సుఖము దు:ఖము ఉండవు. అటువంటి వారికి జనన మరణ బంధనములు కూడా ఉండవు. కర్మఫలముల వలన బంధనములు, వాటి వలన వాసనలు, వాసనల వలన పునర్జన్మ కలుగుతాయి. అసలు కర్మ బంధనములు లేని వాడికి ఇవన్నీ ఉండవు. మరణానంతరము అతడు పరమ పదము చేరుకుంటాడు. ఇంకమరలా వెనక్కు రావడం ఉండదు. పరమాత్మలో ఐక్యం అవుతాడు.

BhagavadGeetha

స్థితప్రజ్ఞుడు తనకు ప్రతికూలమైన పరిస్తితులలో కూడా ఎలా ఉంటాడు ఎలా వ్యవహరిస్తాడంటే సాధారణంగా మనలాగే ఉంటాడు.. ఎందుకంటే స్థితప్రజ్ఞుడు కూడా సుఖదుఃఖములకు అతీతుడు కాదు. అతడికి పూర్వజన్మకర్మ వాసలను ఉంటాయి. వాటిని అనుభవించక తప్పదు. ఆ వాసనలు పుణ్యము పాపము తో కలిసి ఉంటాయి. అవి సుఖము దుఃఖము రూపంలో ఈ జన్మలో వెంటాడుతుంటాయి. వాటిని తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. అటువంటి సుఖము దుఃఖము వచ్చినపుడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే, దుఃఖము వచ్చినప్పుడు అతని మనస్సు ఉద్విగ్నత చెందదు. అంటే ఎకైట్ మెంట్ కు లోనుకాదు. సుఖము కలిగినపుడు ఒళ్లు మరిచిపోయి ఆనందలోకాల్లో విహరించదు. ఎందుకంటే వాళ్ల మనసులు నిశ్చలత్వాన్ని ధృడత్వాన్ని సంతరించుకున్నాయి. వారికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటుంది. స్థితప్రజ్ఞులు ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల మీద ఆధారపడరు. దేనికీ అతిగా స్పందించారు. నిశ్చలంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ సెట్ ధృడంగా ఉంచుకోవడమే స్తితప్రజ్ఞుడి లక్షణము.

BhagavadGeetha

రాగము అంటే సంగమము అంటే అటాచ్మెంట్. మనకు లేని ధనము, ఆస్తి, పదవి మనకు లభించడం. కొత్త కొత్త బంధుత్వాలు స్నేహాలు లభించడం. సంగమం ఉన్న ప్రతిచోట భయం ఉంటుంది. ఎందుకంటే లేనిది రావడం, వచ్చింది పోవడం సహజం. కాబట్టి లేనిది రావాలనే కోరిక, వచ్చింది పోతుందోమో అని భయం ప్రతివాడికి ఉంటుంది. కోట్లు సంపాదించినా అతనికి సెక్యూరిటీ ఉండదు. భయం పెరుగుతుంది.. ఎక్కువ ధనం ఉంటే ఎక్కువ భయం. దానిని కాపాడలేక భయం. కొడుకుల వల్ల, కూతుళ్ల వల్ల, బంధువుల వల్ల భయం. వాళ్లు తన ఆస్తిని కాజేస్తారేమో అనే భయం. నిరంతరం భయంతోనే బతుకుతుంటాడు. అటువంటివి స్థితప్రజ్ఞుడికి ఉండవు. ఎందుకంటే అతడికి సంగమమే ఉండదు. ఇంక భయానికి ఆస్కారం లేదు.

BhagavadGeetha

క్రోధము, క్రోధము అంటే అనవసరమైన ప్రతిస్పందనలు కలిగి ఉండడం కొంతమందికి ఊరికినే కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో అతనికే తెలియదు. ఎదుటి వాడు ఏ చిన్న మాట అన్నా, ఏ చిన్న ప్రతికూల విషయం సంభవించినా, అంతర్గతంగా అతనిలో విపరీతమైన ప్రతిస్పందనలు కలుగుతాయి. అవి కోపంగా బయటకు వస్తాయి. అప్పుడు అవయవాలు అతని స్వాధీనంలో ఉండవు ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో అతనికే తెలియదు. పూర్వము మహాఋషులు అయిన విశ్వామిత్రుడు, దుర్వాసుడు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. శాపాలు ఇచ్చేవాళ్లు. కాబట్టి క్రోధమును అదుపులో పెట్టుకున్నవాడే స్థితప్రజ్ఞుడు. రాగము, భయము, క్రోధము ఒకటి వెంట ఒకటి వస్తాయి కాబట్టి, ఇవి లేకపోవడమే స్థితప్రజ్ఞుని లక్షణాలుగా చెప్పబడ్డాయి.

BhagavadGeetha

జ్ఞానోదయమైన వ్యక్తి తన మనస్సులోనికి ప్రాపంచిక బలహీనతలైన, కామము, క్రోధం, లోభం, ఈర్ష వంటివాటిని రానివ్వడు. అప్పుడే మనస్సు భగవంతుని ధ్యాసలో స్థిరంగా ఉండగలదు. మనస్సుని దుఃఖాల గురించి చింతించటానికి అనుమతి నిస్తే భగవత్ ధ్యాస ఆగిపోయి, ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగి వేయబడుతుంది. చిత్రహింస అంటే ఇలాగే ఉంటుంది. ప్రస్తుత బాధ కన్నా, పాత హింసల బాధ జ్ఞాపకాలు, ఇకముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఎప్పుడైతే మనస్సు ఈ రెంటినీ వదిలి వేసి, ప్రస్తుత వేదనని తట్టుకొవటానికి ప్రయత్నిస్తే, బాధ ఆశ్చర్యంగా బాగా తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయి లోనే ఉంటుంది. మన పురాణాల్లో, చరిత్రలో ఋషులు మునులు, సన్యాసులు, ఇటువంటి పద్దతుల ద్వారానే రాక్షకులు, శత్రువుల చిత్రహింసలను తట్టుకునేవారు. ఈ విధంగానే, బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడు, అది ఆయా భోగ వస్తువుల కోసం పరుగులు పెడుతుంది, దీనితో మనస్సు భగవత్ ధ్యాస నుండి మరలి పోతుంది. కాబట్టి, సుఖాల కోసం వెంపర్లాడకుండా, దుఃఖాల వల్ల చింతించకుండా మనస్సుని కట్టడి చేసినవాడు స్థిత ప్రజ్ఞుడైన ముని. ఇంకా, అటువంటి యోగి, భయము, కోపము వంటి వాటికి తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు. ఈ విధంగా మనస్సు సర్వోత్కృష్టమైన స్థితిలోనే ఉంటుంది.

BhagavadGeetha

శమము అంటే మనసును అనవసరంగా ఆలోచనలతో నింపెయ్యడం. ఎవడన్నా ఒకడు మరొకడిని ఏదో ఒక మాట అన్నాడు అనుకుందాము. రెండవ వాడు "వీడు నన్ను తిట్టాడు." అనే నిర్ణయానికి వస్తాడు. దాంతో వదిలిపెట్టడు. ఏమేమి పదాలతో తిట్టాడు? ఎలా తిట్టాడు? దానికి నేనేం ప్రతీకారం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తుంటాడు. పొరపాటున వాడు ఎక్కడన్నా కనపడితే మెంటల్లీ అప్సెట్ అవుతాడు. ఇలా కాకుండా ఎక్కడిదక్కడ వదిలేస్తే హాయిగా ఉండవచ్చు. కొంత మంది చిన్న చిన్న విషయాలను కూడా సంవత్సరాల తరబడి మనసులో పెట్టుకొని బాధపడుతుంటారు. మరి కొంతమందిలో కక్షలు తరతరాలు ఉండటం మనం చూస్తున్నాము. ఇదంతా మనసును నిగ్రహించుకోలేకపోవడమే. మనసు మన అధీనంలో లేకపోవడమే. ఉదాహరణకు ఎవరన్నా నీకేం తెలియదు నోరుమూసుకో అన్నాడనుకోండి. వెంటనే విపరీతంగా స్పందించకుండా కాసేపు మనసును నిగ్రహించాలి. నిజాయితీగా ఆలోచించాలి. వాడు నన్ను “నీకేం తెలియదు" అన్నాడు. ఈ విషయం నిజంగానే నాకు తెలియదు కదా. ఆ మాటే వాడు అన్నాడు. దానికి నేనెందుకు కోప్పడాలి అని అనుకుంటే సరిపోతుంది. ఒక వేళ మీకు బాగా తెలిసిన విషయాన్ని ఎవడో “నీకేం తెలియదు" అన్నాడనుకోండి. "పాపం. నాకు ఆ విషయం తెలుసు అన్న విషయం వాడికి తెలియదు. ఏం చేస్తాం. అది వాడి అజ్ఞానం" అని అనుకుంటే సరిపోతుంది. అలా కాకుండా "ఆహా! నాకు తెలియదంటావా!" అంటూ వాడి మీదికి పోతే మాటల యుద్ధం మొదలవుతుంది. ఇదే మనోనిగ్రహం.

BhagavadGeetha

జ్ఞానేంద్రియములు ఎప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తుంటాయి. అప్పుడు ప్రాపంచిక విషయముల ప్రభావము వాటి మీద పడే అవకాశము ఎక్కువగా ఉంది. వీటి యొక్క తీవ్రమైన ప్రభావము తమ మీద పడినప్పుడు, బుద్ధిమంతుడు తన జ్ఞానేంద్రియములు వాటి వల్ల ప్రభావితం కాకుండా తనలోకిలాక్కోవాలి. దానికి తాబేలును ఉదాహరణగా చెప్పారు. తాబేలు చిన్నగా నడుస్తుంది. ఆపద వచ్చినపుడు పరుగెత్తలేదు. ఎవరినీ పొడవడానికి పొడుగాటి ముక్కులేదు. కరవడానికి పళ్లులేవు. అందుకని దీనికి రక్షణగా దాని శరీరం మీద ఒక ధృడమైన డిప్పను ఏర్పాటు చేసాడు పరమాత్మ. తనకు ఏదైనా ఆపద సంభవిస్తుంది అనే భావన రాగానే తాబేలు తన నాలుగు కాళ్లు, తల తన డిప్పలోకి లాక్కుంటుంది. సురక్షితంగా ఉంటుంది. అలాగే బయట నుండి ఏదైనా అనవసరమైన విషయం లోపలకు వస్తుంది అని తెలియగానే మనం కూడా మన ఐదు ఇంద్రియములను తాబేలు మాదిరి లోపలకు లాక్కోవాలి. (తాబేలు తనకు ఉన్న ఒక తల నాలుగు కాళ్లు లోపలకు లాక్కుంటుంది. అలాగే మనం కూడా మన ఐదు ఇంద్రియములను లోపలకు లాక్కోవాలి అని తాబేలును ఉదాహరణగా చెప్పారు.) సర్వశం అంటే అన్ని ఇంద్రియములను అని అర్థం. ఏదో ఒక ఇంద్రియము అంటే కళ్లు మూసుకోవడమో, చెవులు మూసుకోడమో కాదు. గాంధీగారి మూడు కోతుల కథ మీకు తెలుసు. అవి కళ్లు, చెవులు, నోరు మూసుకొని ఉంటాయి. చర్మము మూసుకోలేదు. ముక్కు మూసుకుంటే ఊపిరాడక చనిపోతాడు. అందుకనీ కళ్లు చెవులు నోరు మూసుకుంటే బయట విషయాలు లోపలకు వచ్చే అవకాశం లేదు అని మూడుకోతుల కథ మనకు బోధిస్తుంది. అదే ఇక్కడ తాబేలు ఉదాహరణతో చెప్పారు. అలా చేసిన వాడి జ్ఞానం ధృఢంగా ఉంటుంది. చలించదు. ప్రాపంచిక విషయాల వెంట పరుగెత్తదు. తనకు ఏం కావాలో అంతవరకే తీసుకుంటుంది. అనవసర విషయాల జోలికిపోదు.

BhagavadGeetha

పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతను ఋగ్వేదం లో పెర్కొనబడ్డాడు, దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. 'సౌభరి సంహిత' అనే ఒక గ్రంధం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు. సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటిలోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూసాడు. ఆ దృశ్యం అతని మనస్సు ఇంద్రియములను చలింపచేసింది, మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెల్లుబికింది. తన ఆధ్యాత్మిక సాధన పరిత్యజించి, ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటినుండి బయటకు వచ్చాడు. ఆ కాలంలో అయోధ్యకు రాజు మాంధాత, అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి యాభై మంది, ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరి ముని ఆ రాజు వద్దకి వచ్చి ఆ యాభై మందిలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు. మాంధాత రాజు ఆ ముని స్వస్థచిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు "ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు!" అని. ఆ రాజు కి, సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు, కాబట్టి ఇతని కోరికని నిరాకరిస్తే, ముని అతనిని శపించవచ్చు. కానీ, తను ఒప్పుకుంటే, తన కుమర్తెలలొ ఒకరి జీవితం నాశనం అయిపోతుంది. ఎటూతోచని పరిస్థితిలో రాజు ఇలా అన్నాడు, "ఓ పుణ్యపురుషా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను, వారిలో ఎవరు మిమ్ములను ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది". రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు, కాబట్టి ఈ ప్రకారంగా, ముని శాపాన్ని తప్పించుకోవచ్చు. సౌభరికి రాజు ఉద్దేశ్యం పూర్తిగా తెలుసు. తను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాడు. ఆ సాయంత్రం తన యోగ శక్తి ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా, మరుసటి రోజు రాజ మందిరం వెళ్ళినప్పుడు , ఆ యాభై మందీ రాకుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్దుడై ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ఇప్పుడు, తన యాభై మంది కుమార్తెలు ఒకే భర్త ని పంచుకోవటంలో తమలో తాము తగవు పడతారేమో ఆ రాజు చింతించాడు. కానీ, సౌభరి మరల తన యోగ శక్తి ని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగించటానికి అతను యాభై రూపములు స్వీకరించి, తన పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి, వారందరితో వేర్వేరుగా నివసించాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడచి పోయినవి. సౌభరికి ప్రతి భార్య తో చాలా మంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా పిల్లలు కలిగి, చివరకి ఒక చిన్న పట్టణం తయారయిందని పురాణములలో చెప్పబడింది. ఒక రోజు ఆ ముని..ఒక రోజు ఆ ముని తన అసలు స్పృహకొచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు: “అహో ఇమం పశ్యత మే వినాశం” (భాగవతం 9.6.50) "ఓ మానవులారా! భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్లారా, జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి. నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడేమైపోయానో. నేను యాభై శరీరాలు సృష్టించాను మరియు యాభై స్త్రీ లతో వేల సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు, సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకొని, ఆ దిశలో వెళ్ళవద్దు."

BhagavadGeetha

అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అంతా మంచే జరుగుతుంది. కాని కోరికలు అన్నీ తీరవు కదా! మనకు తీరని కోరికలే ఎక్కువ. ఆ ప్రకారంగా విపరీతంగా ఊహించుకున్న కోరికలు తీరకపోతే విపరీతమైన కోపం వస్తుంది. ఒక వేళ ఆ కోరిక తీరిందనుకుందాము. దాని వెంట మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఎందుకంటే దొరికినదానితో తృప్తి చెందడం మానవ లక్షణం కాదు. ఉన్నదానిని పక్కన బెట్టి లేనిదాని కోసం పాకులాడటం మనకు పుట్టుకతో వచ్చిన గుణం. కాబట్టి కోరికలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. అవి తీరకపోతే కోపం రావడం సహజం. ఆ కోపం మనమీద కాదు. ఎవరిమీదనో కోపం. వాడి వల్ల నాకు ఇలా జరిగింది. వీడి వల్ల నాకు ఇలా జరిగింది. అని వాడి మీదా వీడిమీద కోపం వస్తుంది. కొంతమందికి అకారణ కోపం. దానికి ఒక కారణం ఉండదు. చిరుబురులాడుతుంటాడు. అసహనంగా ఉంటాడు పలకరిస్తే కస్సుమంటాడు. చేతిలో ఏది ఉంటే అది విసిరికోడతాడు. కోపం అంటూ వేరే ఏమీ లేదు. అనుకున్న కోరిక తీరకపోతే, అనుకున్నది జరగకపోతే, తాను అనుకున్నట్టు కాకుండా వ్యతిరేకంగా జరిగితే, తనకు నచ్చని వాడిని చూస్తే కలిగే స్థితి కోపము. ఒక ప్రవాహం పోతూ ఉంటుంది. అది ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఏదైనా అడ్డుతగిలితే ఎగిసిపడుతుంది. అలాగే అనుకున్నది నెరవేరకపోతే, మనకు నచ్చనిది జరిగితే, కోపం వస్తుంది. క్రోధం వచ్చిన తరువాత జరిగే పరిణామము... మానవుడు తాత్కాలికంగా వివేచనా శక్తి కోల్పోతాడు. విచక్షణ ఉండదు. మంచి చెడు గుర్తించడు. ఎవరిని తిడుతున్నాడో ఏం తిడుతున్నాడో చూడడు. నోటికి ఎంతవస్తే అంత అనేస్తాడు. దానినే మోహము అంటారు. అంటే ఆ కోపానికి వశుడు అవుతాడు. ఆవేశానికి లోను అవుతాడు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తాడు. శంకరుల వారు కోపం వచ్చినవాడి గురించి చెబుతూ అటువంటి వాడు గురువునుకూడా ఆక్షేపిస్తాడు నీకేం తెలుసు అంటాడు. తల్లిని కూడా కొట్టడానికి పోతాడు. ఇటువంటి స్థితికి చేరుకున్నప్పుడు మానవుడికి బాహ్య స్మృతి ఉండదు. ఒకవిధమైన ట్రాన్స్ ఉంటాడు ఊగి పోతుంటాడు. అంటే మంచి చెడు తెలుసుకొనే స్మృతి అంటే జ్ఞాపక శక్తి పోతుంది. తాను ఎవరితో మాట్లాడుతున్నాడో మరిచిపోతాడు. నువ్వెంత అంటే నువ్వెంత అని అంటాడు. వాడు నా యజమాని వాడు నా తండ్రి, నా అన్న నా బంధువు, నా భార్య అనే స్పృహ (జ్ఞాపకం) కూడా ఉండదు. ఎవరినీ లెక్కచేయడు. ఆ స్థితి నుండి మానవుడు ఇంకా దిగజారి తన బుద్ధిని కోల్పోతాడు. ఏది చేయాలి ఏది చేయకూడదు అని నిర్ణయించేది బుద్ధి. ఆ బుద్ధి కూడా పని చేయదు. పక్కకు తొలిగి ఉంటుంది. ఎందుకంటే చెప్పినా వినే స్థితిలో ఉండడు.

BhagavadGeetha

ఉదయం పూట పొగమంచు సూర్య కాంతిని కప్పివేసి తగ్గించినట్టు, కోపము వివేకాన్ని క్షీణింపచేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేస్తారు, వారు దానికి తరువాత చింతిస్తారు, ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ది, భావోద్వేగాలచే కప్పి వేయబడుతుంది. జనులు అంటారు, "అతను నాకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడు, నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను? నాకు ఏమయింది?" నిజానికి ఏమయిందంటే, క్రోధం వలన విచక్షణ జ్ఞానం లోపించింది అందుకే పెద్ద వారిని దూషించే తప్పిదం జరిగింది. బుద్ధి మబ్బుకమ్మినప్పుడు అది స్మృతి (జ్ఞాపక శక్తి) భ్రంశను కలుగ చేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి, భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకోపోతాడు. అక్కడి నుండి ఇక అధో-పతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ది వినాశనాన్ని కలుగచేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది, అదే నశించినప్పుడు, వ్యక్తి సర్వ నాశనమైపోతాడు. ఈ విధంగా, దైవత్వం నుండి అధార్మికతకు పతనం అయ్యే ప్రక్రియ, ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడింది.

BhagavadGeetha

రాగము అంటే ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది అనే భావన. ఇది నాకు చాలా ఇష్టం అనే భావన. ద్వేషము అంటే ఇది నాకు ఇష్టంలేదు. దీని వలన నాకు ఎటువంటి సంతోషము కలుగదు. పైగా దు:ఖం వస్తుంది. కాబట్టి ఇదంటే నాకు ద్వేషము అనే భావన ఈ రెండూ చెడ్డవే. ఇవి దూరంగా పెడితే మనశ్శాంతి దానంతట అదే కలుగుతుంది. ఎవరైతే రాగద్వేషములకు లోనుకాకుండా, మనసును బుద్ధిని అదుపులో పెట్టుకొని ఉంటాడో, అటువంటి వాడు ప్రాపంచిక విషయములలో మునిగితేలుతున్నా, వాటికి అంటకుండా, వాటితో ఎటువంటి సంగము లేకుండా, ప్రశాంతంగా ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టు వలె అటు ఇటు తిరుగుతుంటాడు కానీ దేనికీ అంటుకోడు. అటువంటి వాడి ఇంద్రియములు, మనస్సు అతనిస్వాధీనంలో ఉంటాయి. అతడు చెప్పినట్టు నడుచుకుంటాయి. స్వామీజి అంటే అర్థం ఇదే. ఎవరైతే తన మనస్సును ఇంద్రియములను తన వశంలో ఉంచుకుంటాడో, వాటికి తానేయజమాని అంటే స్వామి అవుతాడో ఆయనే స్వామీజి. అంతే కానీ సిల్కు కాషాయాలు కట్టుకొని విలాసవంతమైన ఆశ్రమాలలో ఉండేవాళ్లు కాదు.

BhagavadGeetha

ప్రసన్నత, మనశ్శాంతి ఎలా ఉంటుంది అంటే సకల దుఃఖములను నాశనం చేస్తుంది. మనలో అడ్డదిడ్డంగా చెలరేగే ఆలోచనలు మన ప్రశాంతతను నాశనం చేస్తే, ఈ ప్రసన్నత మనలో ఉన్న దుఃఖాలను నాశనం చేస్తుంది. దుఃఖాలు నశిస్తే కలిగే స్థితి నిశ్చలానంద స్థితి. బ్రహ్మానందస్థితి. మనకు ఎక్కడ చూచినా ఆనందం తాండవిస్తుంది. అటువంటి వాడు శ్మశానంలో ఉన్నా ఆనందంగా ఉంటాడు. ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా సంయమనము కోల్పోడు. ఇది బయట జరిగే పరిణామము. ఈ ప్రసన్నత, ప్రశాంతత ఉంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది. మనస్సు ఖచ్చితమైన మార్గంలో ప్రయాణం చేస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. భగవంతుని మీద ఏకాగ్రబుద్ధి ఉంటుంది. ప్రాపంచిక విషయముల యందు పరుగెట్టదు. ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటుంది. అప్పుడు వాడు కర్మయోగి అవుతాడు. అతని మనస్సు పరమాత్మయందు స్థిరంగా లగ్నం అవుతుంది.

BhagavadGeetha

మనం సాధారణంగా మోక్షం అనే పదాన్ని వింటూ ఉంటాము. మోక్షము అంటే వదిలివేయడం. అంతేకానీ మరణించిన తరువాత దేవదూతలు వచ్చి విమానంలో మనలను మోక్షానికి తీసుకుపోతారనీ, మోక్షం అంటే అది ఒక ప్రదేశము అనీ అనుకోకూడదు. మోక్షము అంటే మనం జీవించి ఉండగానే ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని వదిలిపెట్టి, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహముసాధించి, రాగద్వేషములను వదిలిపెట్టి, ప్రశాంతంగా జీవించడం ఇదే మోక్షము. మోక్షము అంటే ఒకరు ఇచ్చేది కాదు. తనకు తానుగా సంపాదించుకోతగ్గది. ఎవరైనా "నేను మీకు మోక్షము ఇస్తాను" అని అంటే అతనికి ఏమీ తెలియదు అని మనం అనుకోవాల్సివస్తుంది. కాబట్టి మోక్షం అంటే జీవించి ఉండగానే పరమ శాంతిని పొందడం అంటే జీవన్ముక్తిని పొందడం. అని అర్థం. జీవించి ఉండగానే అన్నిటి నుండి విముక్తిని పొందడం. ఈ విముక్తినే పరమశాంతి అని అంటారు.

BhagavadGeetha

ఈ లోకంలో రెండు నిష్టలు అనగా జీవన విధానాలు ఉన్నాయి. సాంఖ్యయోగులు అంటే జ్ఞానయోగులకు సాంఖ్య యోగము, సాధారణ యోగము అభ్యసించేవారికి కర్మయోగము నిర్దేశింపబడ్డాయి. ఎవరెవరు ఏయే యోగము నందు ఆసక్తి ఉందో వారు ఆయాయోగములను అనుసరించవచ్చు. అంటే జీవుల మనస్తత్వములను బట్టి, రెండు మార్గాలను నిర్దేశించాడు పరమాత్మ. అందరికీ ఒకే మార్గం చూపడం హిందూధర్మంలో లేదు. ఎవరికి తోచిన మార్గము వారు అనుసరించవచ్చు. కొంత మందికి తత్వవిచారణ మీద ఆసక్తి ఉంటుంది. వారికి సాంఖ్యయోగము నిర్దేశించారు. మరి కొందరు కర్మలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. వారికి జ్ఞానము ఓ పట్టాన బోధ పడదు. అటువంటి వారికి కర్మయోగము నిర్దేశించారు. అలాకాకుండా బలవంతంగా ఏదో ఒక యోగము అందరి మీదా రుద్దితే, అది వారికి అర్థం కాకపోవచ్చు లేదా అసలు ఆచరించకుండా మానవచ్చు. అందుకని పరమాత్మ ఎవరెవరికి ఇష్టము, అనుసరణీయము అయిన యోగములను వారివారికి ఉపదేశించాడు. ఇక్కడి నుండి చెప్పబోయే శ్లోకాలలో వేదాలలో, ఉపనిషత్తులలో అక్కడక్కడ ఉన్న విషయాలన్నీ ఒకచోటికి తెచ్చి క్రోడీకరించి మనకు ఈ అధ్యాయంలో అందించాడు వ్యాసుడు. వేదము అంటే తెలుసుకోతగినది. తెలియజేసేది. ఎవరు ఎవరికి తెలియజేస్తారు? తెలియని వాడికి తెలిసిన వారు తెలియజేస్తారు. కాబట్టి మనకు ఏమీ తెలియదు అనే భావనతో వేదం మొదలవుతుంది. ఈ వేదం కూడా రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగము అంతా దేవతలను స్తోత్రములు చేయడంతో పాటు, యజ్ఞయాగాదులు గురించి చెప్పారు. ఉత్తర భాగంలో ఆత్మ జ్ఞానం, పరమాత్మ స్వరూపం గురించి చెప్పారు. మనకు ఆత్మజ్ఞానం గురించి తెలియదు కాబట్టి, దానిని మనకు తెలియజేస్తుంది వేదము. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకునే ముందు కర్మ ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి. ఇది మామూలు వాళ్ల విషయం. కొంతమంది ఈ కర్మ యోగమును అంతకు ముందే దాటిన వాళ్లు ఉంటారు. వారు సరాసరి జ్ఞానయోగానికి వెళ్లవచ్చు. భోజనం చేసే ముందు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అనేది జీవన విధానము. కొంత మందికి కాళ్లు చేతులు ఎల్లప్పుడు శుభ్రంగానే ఉంటాయి. వారు నేరుగా భోజనం చేయవచ్చు. అలాగే ఆత్మజ్ఞానము తెలియని వారు మొదట కర్మయోగంతో మొదలుపెట్టి మనసు, ఇంద్రియములు శుద్ధి అయిన తరువాత జ్ఞానయోగమునకు వెళ్లవచ్చు. మరి కొంత మంది పూర్వజన్మ వాసనలనుబట్టి జ్ఞానవంతులుగానే పుడతారు. వారు అంతకు ముందు జన్మలలో కర్మయోగం అవలంబించి, పరిశుద్ధులై ఉంటారు. అటువంటి వారు మరలా కర్మయోగంతో మొదలు పెట్టనవసరం లేదు. నేరుగా జ్ఞానయోగముతో ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ లోకంలో రెండు విధములైన జీవిత విధానములు అంటే నిష్టలు ప్రతిపాదించబడ్డాయి అని పరమాత్మ చెబుతున్నాడు

BhagavadGeetha

ఈ లోకము నందు, ద్వివిధా నిష్ణా అంటే రెండు రకములైన నిష్టలు, అంటే జీవన విధానాలు, పురా, ప్రోక్తా- అంటే ఈ విషయం నీకు ఇంతకు ముందే చెప్పాను. గుర్తుకు తెచ్చుకో, ఇందులో మరియొక అర్థం కూడా ఉంది. అత్యంత పురాతనంగా ఈ విషయం నా చేత ఈ లోకంలో ఉన్న మానవులకు చెప్పబడింది. కాలానుగుణంగా వారు మరిచిపోయారు కాబట్టి మరలా చెబుతున్నాను అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రెండూ నిష్ఠలూ సరి అయినవే. ఈ రెండు నిష్ఠలలో ఒకటి కర్మయోగము. ఇది యోగులకు పరిమితము అయింది. దీనినే ప్రపంచంలో క్రియాశీలకంగా ఉండే విధానము. దీనినే ప్రవృత్తి మార్గము అని కూడా అంటారు. అంటే ప్రాపంచికవిషయములలో ఉండటం. అర్థము కామము వీటి కోసం ప్రయత్నించడం. రెండవ విధానము జ్ఞాన యోగము. వీరికి ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి ఉండదు. ఎల్లప్పుడూ మనసును ఆత్మతో అనుసంధానం చేసి, ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నిస్తుంటారు. ఇది సాంఖ్యయోగులకు పరిమితమైనది. దీనిని నివృత్తి మార్గము అంటారు. ఎందుకంటే వీరు ఇదివరకే ప్రవృత్తి మార్గాన్ని దాటారు. అటువంటి వారికి ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛలలో ఎటువంటి ఆసక్తి ఉండదు. నిర్లిప్తంగా ఉంటారు. దేని గురించి పట్టించుకోరు. ఆత్మగురించి ఆలోచిస్తుంటారు. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని జీవన విధానములను రెండు విధములుగా విభజించవచ్చు. మొదటిది గృహస్థుగా ఉండి, నిష్కామ కర్మలు చేస్తూ, కర్మఫలముల మీద ఎటువంటి ఆసక్తి లేకుండా, మనసును శుద్ధి చేసుకొని, తరువాత వానప్రస్థమునకు వెళ్లి చివరకు సన్యాసము స్వీకరించి, ముక్తిని పొందడం. దీనిని ప్రవృత్తి మార్గము అని అనవచ్చు. ఆ రోజుల్లో అయితే గృహస్థాశ్రమం కాగానే, కొడుకులకు బాధ్యతలు అప్పగించి, వానప్రస్థమునకు అంటే అడవులకు పోవడం తుదకు సన్యాసం స్వీకరించడం జరిగేది.

BhagavadGeetha

ఉద్యోగస్థులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, 60 ఏళ్లు నిండగానే తమతమ వృత్తుల నుండి రిటైర్ అయి, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని, అర్థ కామములను వదిలిపెట్టాలి.(మనకు ఈ విషయాన్ని గుర్తు చేయడానికే షష్ఠిపూర్తి మహోత్సవం ఏర్పాటు చేసారు.) దైవధ్యానం, పూజలు, వ్రతాలు చేయాలి. ప్రాపంచిక విషయాలలో ఆసక్తి వదిలిపెట్టాలి. నివృత్తి మార్గాన్ని అవలంబించాలి. మోక్షానికి బాటలు వేసుకోవాలి. కాని ఈ రోజులో ఆ పని ఎవరూ చేయరు. చేయడం లేదు. కొడుకులు, కూతుళ్లు, మనుమళ్లు, మనుమరాళ్లు వాళ్ల కోసం కూడా. సంపాదించడం, వారికి సేవలు చేయడం, వారందరూ బయటకు షికార్లకు పోగానే, ఇంటికి కాపలాగా ఉండటం, వారు ఏమి చేసినా ఏమీ అనలేక మనసులోనే కుమిలిపోవడం, తన మాట ఎవరూ వినడం లేదని లేక పెద్దగా అరిచి బిపి పెంచుకోవడం, వీటితోనే సరి పోతుంది. రిటైర్ మెంట్ తరువాత కూడా ఉద్యోగాలు చేసి సంపాదించే వాళ్లను కొందర్ని మనం చూస్తూనే ఉన్నాము. ఇంక వానప్రస్థము సన్యాసము ఎక్కడ. జీవితంలో ప్రశాంతత ఎక్కడ! కాబట్టి 60 తరువాత గృహస్తుగానే ఉండి నివృత్తి మార్గము అవలంబించాలి. అన్నిటినీ వదిలెయ్యాలి. అంటే అడవులకు పోకుండా కాషాయములు కట్టకుండా, నివృత్తి మార్గము అవలంబించడం అన్నమాట. అంటే ప్రాపంచిక విషయాలలో తిరుగుతూ కూడా అంటీ ముట్టనట్టు ఉండటం. తామరాకు మీద నీటిబొట్టు మాదిరి ప్రపంచంలో వ్యవహరించడం. ఇంక రెండవ మార్గము.. నివృత్తి మార్గము. బ్రహ్మచర్యము తరువాత గృహస్థ ఆశ్రమములోకి వానప్రస్థములోకి పోకుండా నేరుగా సన్యసించడం. ఇటువంటి వారు గత జన్మలలోనే ప్రవృత్తి మార్గంలో ఉండి, తమ ఆత్మలను పరిశుద్ధం చేసుకున్న వారు. అటువంటి వారికి తిరిగి గృహస్థ ఆశ్రమంతో పనిలేదు. ఈ విధంగా నివృత్తిమార్గంలో ఉన్న సన్యాసి ప్రాపంచిక విషయములలో ఉండకూడదు. పట్టణములలోకి రాకూడదు. దేవాలయములలోనే ఉండాలి. ఇవి సన్యాసి మార్గములు. ఇదే విషయాన్ని కృష్ణుడు మానవులు ఆచరించ వలసిన రెండు నిష్టలుగా చెప్పాడు. ఒకటి జ్ఞానయోగము సాంఖ్యయోగులకు, అంటే జ్ఞానముతో అనుసంధానింప బడ్డవారు. ఎవరైతే జ్ఞానము కావాలని కోరుకుంటారో, ఎవరుజ్ఞానము నందు రతులై ఉంటారో, ఎవరైతే సన్యాసము పుచ్చుకుంటారో, వారికి సాంఖ్యము చెప్పబడింది. దానిని నివృత్తిమార్గము అని పైనచెప్పుకున్నాము. రెండు కర్మయోగము యోగులకు చెప్పబడింది. యోగులు అంటే కర్మచేయదగిన వారు. కర్మలతో అనుసంధానింపబడ్డవారు. వీరింకా జ్ఞాన సాధనకు అర్హత సంపాదించలేదు. ముందు కర్మలు చేసి తరువాత జ్ఞానులు కావాలి. వీరికి ధనము మీద, కోరికల మీద ఆసక్తి పూర్తిగా పోదు. మనసు అటువైపు లాగుతూ ఉంటుంది. వారికికర్మయోగం చెప్పబడింది. నిష్కామంగా కర్మలు చేయడం, శ్రవణం, ఇంద్రియనిగ్రహం మనోనిగ్రహం ఇలా పైపైకి ఎదగాలి.

BhagavadGeetha

సత్వ, రజస్తమోగుణాలు ప్రకృతి నుండి పుట్టాయి. మానవుడు కూడా ఈ ప్రకృతి లోనుండి పుట్టాడు. కాబట్టి ఈ గుణాలు మానవులను ఆకర్షించి, వారిని కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి. ఈ గుణాలు మానవునిలో ఉన్నంత వరకూ ప్రతి మానవుడూ కర్మలు చేస్తూ ఉండవలసిందే. ఎవరూ కర్మ చేయకుండా ఉండలేడు. కర్మలు చేయడం ప్రతి మానవుని సహజ లక్షణం. మానవునికి ఇష్టం ఉన్నా లేక పోయినా, మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి కానీ ఏ కర్మాచేయకుండా ఉండటం అసాధ్యం.

BhagavadGeetha

ఏ మనుష్యుడైనా అంటే సాధారణ మానవుడు, అజ్ఞానంలో ఉన్నవాడు, ఆత్మతత్వము తెలియని వాడు అని అర్థం. సాంఖ్యులు అంటే జ్ఞానులు జితేంద్రియులు అని అర్థం. యోగులు అంటే కర్మలను చేస్తూ ఉండే వాళ్లు. కర్మలు చేయడంలో నిమగ్నమై ఉండే వాళ్లు. జ్ఞానులను గుణములు ప్రభావితం చేయలేవు. వారు ప్రపంచంలో సంచరిస్తున్నా గుణములు వారిని అంటవు. అటువంటి వారికి కర్మయోగము అవసరం లేదు. నేరుగా సన్యాసము స్వీకరించి ముక్తిని పొందుతారు. కాని ఆత్మజ్ఞానము లేని వానికి, కర్మయోగము తప్పని సరి. అటువంటి వారు కర్మలను చేస్తూ ఉండాలి. వారు కర్మలు చేయకుండా ఒక్కక్షణం కూడా ఉండలేరు.

Telugu GK

జనరల్ నాలెడ్జ్

MSK Technologies

Online and Class Room Trainings